సమాజం కోసం సావిత్రిబాయి ఫూలే ఎంతో పాటుపడ్డారు : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

Savitribai Phule contributed a lot for society: National BC Dal President Dundra Kumaraswamy

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, జనవరి 4,2023: సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమెకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా..జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే అని, ఆమె సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు.

‘ఆడవాళ్లు వంటింటికే పరిమితం అవ్వాలి.. ఇల్లు దాటకూడదు అంటూ.. భారతదేశం అంధకారంలో మగ్గుతున్న సమయంలో ఒక వేగుచుక్కలా సావిత్రిబాయి పూలే వెలుగులు నింపారని ఆయన తెలిపారు. సావిత్రిబాయికి చిన్న తనం నుంచే చదువంటే ఎంతో ఇష్టమని, అప్పట్లో బాలికలకు విద్య నిషేధం ఉండగా.. తొమ్మిదేండ్ల ప్రాయంలోనే12ఏళ్ల జ్యోతిబాఫూలే తో బాల్య వివాహం చేయగా.. జ్యోతిబాఫూలే సావిత్రిబాయిని ప్రోత్సహించి చదివించారని ఆయన వెల్లడించారు. నాటి ఆధిపత్య, అనాగరిక సమాజం మహిళలకు విద్య నిషేధమని అంటున్నా సావిత్రిబాయి చదువులో ముందుకు వెళ్ళింది. స్త్రీలకు విద్యనేర్పేందుకు 1847-48 లో అహ్మదాబాద్ లో ఉపాధ్యాయ శిక్షణ పొందింది.’ అని తెలిపారు.

“ఇక 1848 జనవరి1వ తేదీన అణచివేసిన నిమ్నవర్గాల బాలికల కోసం పూణేలో బడి తెరచిందంటే ఆమె ధైర్యానికి మనం సలామ్ చేయాలి, 18 సంవత్సరాల వయసుకే ఆమె బహుజనుల కోసం ఓబడి తెరచిందని దుండ్ర కుమారస్వామి అన్నారు. అలా ప్రజలను చైతన్య పరిచేందుకు ఫూలే దంపతులిద్దరూ కలసి మొత్తం 52 పాఠశాలలు నెలకొల్పారు. ఎన్నో దాడులు ఎదుర్కొన్నారు.. తొక్కేయాలని చూశారు.. గ్రామ బహిష్కరణ కూడా చేశారు. కానీ ఆమెను ఇవేవీ అడ్డుకోలేకపోయాయని ఆయన అన్నారు.

స్త్రీలను చైతన్య పరచటం కోసం 1852 లో ‘మహిళా మండల్’ పేరుతో సంఘాన్ని స్థాపించారు. 1873 లో జోతిబాతో కలిసి ‘సత్యశోధక సమాజాన్ని’ నెలకొల్పి మూఢనమ్మకాలపై రాజీలేని పోరాటం చేశారామె. ఒక శతాబ్దం తర్వాత ఆడపిల్లలు విద్యలో రాణిస్తున్నారంటే ఆ తల్లి చేసిన పోరాటాలు, ఆమె చేసిన త్యాగలే కారణమని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. బాల వితంతువులకు విద్యను అందించడం.. విముక్తి చేయడం కోసం సావిత్రి బాయి పూలే ఎంతో కృషి చేశారు. బాల్య వివాహాలు,సతీసహగమనానికి అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

కుల, లింగ వివక్షను నిర్మూలించడంలో చురుకుగా పనిచేశారని ఆయన తెలిపారు. సావిత్రిబాయి సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ పీడిత ప్రజలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని, నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పదని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పవన్, డిజిటల్ మీడియా సుభాష్, బీసీ దల్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply