విరాటపర్వం విప్లవ ప్రేమ కావ్యం…
వాళ్లూ ఓ కన్న తల్లి బిడ్డలే. కాని ఆ తల్లిని వీడి అడవి తల్లి ఒడిలోనే సేదతీరారు. పెద్ద చదువులు చదవినా… బడుగుల హక్కులకై పోరాడారు. గంజి, గడ్క తిన్నారు. మట్టి నేలమీదే పడుకున్నారు. సామ్రజ్యవాదపు ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలుగుతున్న పేదల బతుకులకు… మేమున్నామని భరోసానిచ్చారు. పేదల కష్టాలు, కన్నీలు మనకెందుకులే అని ఏనాడూ అనుకోలేదు. పెత్తందారుల భరతం పట్టారు. భూస్వాములను పల్లెల నుంచి తరిమికొట్టి…పట్టణాల్లో తలదాచుకునేలా చేశారు. ప్రభుత్వాలు వాళ్లను రాజ్య ద్రోహులుగా చిత్రీకరించాయి. నక్సలైట్లగా ముద్రవేశాయి. కాని ప్రజలు మాత్రం.. వాళ్ల కష్టాలను తీర్చే దేవుల్లలా కొలిచారు. ఆ అడవి తల్లి బిడ్డలను… అన్నలన్నారు. ఇది గత చరిత్ర… ఈ చరిత్రను మరోసారి తట్టిలేపిన చిత్రం విరాటపర్వం.
తెలంగాణలో సాయుధ పోరాటాన్ని ఈ చిత్రం కళ్లకు కట్టింది. ఆనాటి పరిస్థితులను… సామాన్యుల జీవితాల ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది. పోరాటాలకు నిలయమైన ఓరుగల్లు సాయుధ పోరాటాన్ని మరోసారి గుర్తు చేసింది. విప్లవం ఎంత బలమైనదో… ప్రేమ సైతం అంతే బలమైనదని చెప్పే కథే విరాటపర్వం చిత్రం. ప్రజలను పీడించే రాజ్యంపై ఓ పోరాటయోధుడు ఎక్కుపెట్టిన బంధూకు చివర… ఓ ఎర్రగులాబీ పూచింది. ఆ గులాబీ పేరే వెన్నెల( సాయిపల్లవి) . ఆ పోరాటయోదుడి పేరే రవన్న( రాణా ). పీడిత ప్రజలపై రవన్నకు ఎంత ప్రేమ ఉందో… అంతే ప్రేమ రవన్నపై వెన్నలకు ఉంటుంది. చుక్కాని లేని నావలా అడవిలో పయనించే రవన్నకు వేగు చుక్కలా కనిపిస్తుంది వెన్నెల. ఇక సెలవని రవన్న వెళ్లిపోతుంటే.. అతని వైపే ఆబరాగా చూస్తుంది. ఎందుకలా చూస్తున్నావని ప్రశ్నిస్తే… చెమ్మగిల్లిన కళ్లతో ప్రేమను వెలిబుచ్చుతుంది. స్వరాజ్యం కోసమే నా ఈ పయనమని రవన్నంటే.. నీ అడుగులో అడుగేస్తానని బదులిస్తుంది. రణమే తన బాటని రవన్నంటే… అరుణారుణమై నీ వెంటే ఉంటానని … నీ ఒడిలో బంధుకులా ఒదిగిపోతానని చెబుతుంది వెన్నెల. వెన్నెల పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయిన తీరు కట్టిపడేస్తుంది. భావోద్వేగబరిత సన్నివేశాల్లో జీవించేసింది. కథ చివరి క్షణంలో తన నటన కన్నుల వెంట నీరు తెచ్చేలా చేస్తోంది.
రవన్న పాత్రలో రాణా చాలా బాగా నటించారు. ఆ పాత్రకు రాణా న్యాయం చేశాడు. కథ చివరి అంకంలో సాయిపల్లవితో ఉండే సన్నివేశాల్లో రాణా అద్భుతంగా నటించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వరంగల్ ప్రాంత వాసి కావడంతో దర్శకుడు వేణు ఊడుగుల కథను చక్కగా రాసుకున్నారు. ఆనాటి పరిస్థితులను కండ్ల ముందు ఆవిష్కరించాడనే చెప్పాలి. 1973-90 నాటి నక్సల్స్ పోరాటాలను తెరకెక్కించడంలో దర్శకుడు వేణు సక్సెస్ అయ్యారు. కొన్ని సన్నివేశాల్లో వచ్చే పాటలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉంది. సినిమాను మరోస్థాయిలో నిలబెట్టడంలో నేపథ్య సంగీతం ఎంతగానో దోహదపడింది. కెమెరామెన్ పనితనం ఆకట్టుకుంది. ప్రతీ ఫ్రేమ్ అప్పటి పరిస్థితులకు అద్దం పట్టింది.
విప్లవం కోసం రాజ్యంపై యుద్ధం చేస్తాడు రవన్న అలియాస్ అరణ్య. అరణ్య ప్రేమ కోసం యుద్ధం చేస్తోంది వెన్నెల. అరణ్యకు న్యాయం కావాలి. వెన్నెలకు అరణ్య ప్రేమ కావాలి. ఇదే విరాటపర్వం…