తెలంగాణ దేవుడు మూవీ రివ్యూ…

తెలంగాణ దేవుడు మూవీ రివ్యూ…

శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు సాగర్ శిష్యుడైన వడత్యా హరీష్ ఈ చిత్రానికి దర్శకుడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఇందులో
సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.

కథ:

చెప్పడానికి ఇది ఒక చరిత్ర. విజయ్ దేవ్ (జిషాన్ ఉస్మాన్, శ్రీకాంత్) చిన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఎలా నడిచింది? చదువుకునే టైమ్‌లో విజయ్ దేవ్ ఎలా ఉండేవాడు? అతను తెలంగాణ ఉద్యమం వైపు దారి తీయడానికి గల కారణాలేంటి? ఎలా విజయ్ దేవ్ ఉద్యమంలో అడుగుపెట్టి.. ఉద్యమ నాయకుడు అయ్యాడు? ఉద్యమ నాయకుడు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం అతను చేసిన ప్రయత్నాలేంటి? తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది? రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ దేవ్ బంగారు తెలంగాణను సాధించాడా? సమాధానాలన్నింటికి వివరణ ఇచ్చేదే ఈ చిత్రం .

కథనం విశ్లేషణ:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రపై ఇప్పటి వరకు చాలా సినిమాలే వచ్చాయి. ఉద్యమం సమయంలో జగపతిబాబు ప్రధాన పాత్రలో ‘జై భోలో తెలంగాణ’ సినిమా వచ్చి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమం మీద ‘తెలంగాణ దేవుడు’ పేరుతో కేసీఆర్ జీవిత చరిత్రను బాల్యం నుంచి … ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన ప్రధాన ఘట్టాలు ఓ వైపు చూపుతూ… 1956లో ఆంధ్రప్రదేశ్ గా కొత్త రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తరువాత… మళ్లీ ప్రత్యేక తెలంగాణ కోసం 1969 లో మళ్ళీ ఉద్యమం మొదలు కావడం… లాంటి ఘట్టాలను… మరోవైపు చూపిస్తూ… ఎక్కడా బోరింగ్ లేకుండా దర్శకుడు సినిమాను తెరపై ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీని వదిలి… తెలంగాణ సాధన కోసం.. ఉద్యమ పార్టీని స్థాపించి… ఆ తరువాత రాజకీయ పార్టీగా తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలను శాసించే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగి… ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి… బంగారు తెలంగాణ సాకారం ఎలా ఆవిష్కరించారు అనేదాన్ని చాలా చక్కగా చూపించారు. ప్రజల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు… రైతులకోసం కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు… తదితర వాటిని హైలైట్ చేస్తూ తెరకెక్కించిన సీన్స్ అన్నీ ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి.

కేసీఆర్‌ చిన్నతనం నుంచి… తన కాలేజ్ లైఫ్, ఉద్యయం, సీఎం వరకు సాగే కథను కమర్షియల్ ఫార్మాట్ లో కేసీఆర్‌ జీవితాన్ని చాలా ఫ్రెష్‌గా చూపించారు. ఈ కథను… కేసీఆర్ ఇప్పటి జీవితానికి అనుగుణంగా రాసుకొని పాటలు, డ్యూయెట్ లతో ఓ కమర్షియల్ బయోపిక్‌లా తెరకెక్కించారు. కేసీఆర్ కి సాహిత్యం పట్ల అవగాహన ఉంది కనుకే జై బోలో తెలంగాణలో ఓ పాట కూడా రాసారు. ఆయన ఎక్కువగా సీనియర్ ఎన్ టి ఆర్, శోభన్ బాబు గారి సినిమాలు కూడా చూసి… వాళ్ళను అభిమానించారు కావున… ఆ కోణంలోనూ కొంత సినిమాటిక్ లిబర్టీతో ఇందులో కేసీఆర్ అండ్ వైఫ్ కాంబినేషన్లో పాటలు కూడా పెట్టి… ఆడియన్స్ ఎక్కడా డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలగనీయకుండా ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ కామెడీ ఉండాలి అని ఆలోచించి ఈ ప్రత్యేక కమర్షియల్ సీన్స్ ని క్రియేట్ చేసారేమో అనిపిస్తుంది. ఓవరాల్ గా తెలంగాణాకు కేసీఆర్ నిజంగానే ‘తెలంగాణ దేవుడు’ అయ్యాడు.

దర్శకుడు కథ రాసుకుంటున్నప్పుడే శ్రీకాంత్ ని కేసీఆర్ పాత్రకోసం ఎన్నుకోవడంతో… సగం సక్సెస్ సాధించి…. ఆ పాత్రను చాలా ఈజీగా తెరమీద చేయడంతో… పక్కా విజయం సాధించారు. హీరో శ్రీకాంత్ కేసీఆర్ పాత్రలో ఒదిగిపోయారు. ఇంతకు ముందు ఆయన ఎన్నో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేశారు… కానీ ఈ సినిమా లాంటి పాత్ర చేయలేదు. చాలా డిఫరెంట్‌గా చేసి… మరోసారి తానేంటో నిరూపించారు..కేసీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించిన డెబ్యూ నటుడు జిషాన్ ఉస్మాన్ చక్కగా నటించారు. పర్ఫెక్ట్ హైట్, కలర్, బాడీ లాంగ్వేజ్ అన్నీ జిషాన్ ఉస్మాన్‌లో ఉండటంతో… ఈ సినిమాలో మంచి పాత్ర పోషించారు. కేసీఆర్ భార్య పాత్రలో సంగీత… కవిత పాత్రలో మధుమిత… హరీష్ రావు పాత్రలో అజయ్, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రలో సుమన్, రాజశేఖర్ రెడ్డి పాత్రలో కాశీ విశ్వనాథ్, జగన్ పాత్రలో సునీల్, జానారెడ్డి పాత్రలో పృథ్వి… తదితరులు నటించి మెప్పించారు. ముఖ్యంగా రోశయ్య పాత్ర బాగా నవ్విస్తుంది.

దర్శకుడు హరీష్… కేసీఆర్ బయోపిక్ ని… ప్రేక్షకులకు నచ్చేవిధంగా కమర్షియల్ ఫార్మాట్ లో చక్కగా… బోరింగ్ లేకుండా.. ఎంతో ఎమోషనల్ గా వెండితెరపై ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం బాగా కుదిరింది. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ముఖ్యంగా వివిధ పాత్రల కోసం ఎంపిక చేసుకున్న భారీ తారాగణం కోసం నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. చివరిగా.. తెలంగాణ దేవుడు… ఓ ఉద్యమ నాయకుడి విజయ యాత్ర… చూసి తీరాల్సిందే..!!!

రేటింగ్: 3.5