దసరా..రివ్యూ..

ఆడు తెలంగాణోడు… తెలంగాణ ఆత్మను సూపెట్టిండు. ఆడు తెలంగాణోడు… తెలంగాణ పల్లె ప్రజల బతుకు ముఖ చిత్రాన్ని ఆవిష్కరించిండు. ఆడు ఖడక్ తెలంగాణోడు.. తెలంగాణ సోపతిని కండ్లకు కట్టిండు. ఆడు తెలంగాణోడు ఆదే సోపతి కోసం తెలంగాణోళ్లు పానమిత్తరని సాటింపేసిండు. ఆడే దర్శకుడు శ్రీకాంత్ ఓదేల.

దసరా… ఫుల్ లెన్త్ రా కంటెంట్. దోస్తాన్‌కు కులలు, మతాలు లేవని చెప్పిన సినిమా. దోస్తాన్ కోసం పానాలైనా ఇస్తారని చెప్పిన సినిమా. దసరా పండగ తెలంగాణలో ఎట్ల జరుగుతుందో సూపెట్టిన సినిమా. ఈ దసరాలో ఇంకో కథ కూడా ఉన్నది. ఆ కథే తెలంగాణలో మందు ఎట్ల నడుస్తదో చెప్పింది.

ఇది ఏ ఒక్క రోజో రాసుకున్న కథ కాదు. ఒక్క పూటలోనో వచ్చే ఆలోచన అసలే కాదు. పుట్టిన కానుంచెల్లి ఊరును సూసుకుంటూ రాసుకున్న కథ. తెలంగాణకు చెందిన సింగరేణి ప్రాంతంలో పల్లె ఎట్లుంటది. ఆడ బొగ్గుతో మసిబారిన బతుకులేందన్నది సూపించడంలో శ్రీకాంత్ ఓదేల సక్సెస్ అయ్యిండు. ఫస్ట్ ఆఫ్‌లో కీలక సన్నివేశాలను పాటల రూపంలో చెబితే బాగుంటదన్న శ్రీకాంత్ ఆలోచన తెరమీద అద్భుతంగా కనిపించింది.

కల్లులోకి గుడాలు. ముందులోకి అంచుకు బోటి కూర. సోపతిగానితోనే తాగలన్న కుతి ఎట్లుంటది… ఆటి ముచ్చటేందన్నది దసరాలో కనిపిస్తదీ. కథ ఎంత మంచిగ రాసుకున్నడో.. నటీనటులు ఎంపిక విషయంలో శ్రీకాంత్ విజయం సాధించాడు.

నిజంగా నానీ నాచురల్ స్టారే. తన పాత్రలో ఒదిగి పోయాడు. ఇక కీర్తి సురేష్ గురించి ఎంత సెప్పినా తక్కువే. తెలంగాణ పల్లెలోని ఓ అందమైన పిల్ల ఎట్లుంటది.. ఎట్ల మాట్లాడతది… గా పిల్ల హావభావాలు ఎట్లెట్లుంటాయో కీర్తి సురేష్ అచ్చుగుద్దేసింది. మిగతా వారు వారి పాత్రలకు న్యాయం చేశారు. పాటల్లో ఎక్కడా ఆ ఫీల్ మిస్ కాలే. బ్యాగ్రౌండ్ స్కోర్ దసరకు మరింత బలాన్ని చేకూర్చింది.

క్లైమాక్స్ సినిమాకు మరోబలం. చివరి క్షణంలో తెంపుకొచ్చిన జమ్మి ఆకును నాని.. కీర్తి సురేష్ చేతిలో పెట్టడం భావోద్వేగానికి గురి చేస్తుంది. కథ మందు దుకాండ్లనే సురువైనా.. కొసకు ఆ మందు దుకానాన్ని నాని కాలవెట్టుడుతో అయిపోతది. మొత్తంగా దసరా పండుగకు పాలపిట్టను సూసినట్లు అనిపించింది… దసరా సినిమా. 90ML ఓసీ మందులో 45ML నీళ్ల పోసుకొని తాగినట్లు అనిపించింది పో. గిఫ్‌న ఎక్కింది. కచ్చ కథ. గొడ్డుకారం స్క్రీన్ ప్లే.

Leave a Reply