మార్టూరు గ్రామానికి తాగునీటి ట్యాంకు అందించిన యోకోహామా టైర్స్
మార్టూరు గ్రామానికి తాగునీటి ట్యాంకు అందించిన యోకోహామా
(ఎటిసి టైర్స్ ఎపి ప్రైవేట్ లిమిటెడ్) టైర్స్
- ద సోషల్ ల్యాబ్ (టిఎస్ఎల్) తో భాగస్వామ్యం
- పోలీసులకు బారికేడ్ల అందజేత కూడా..
విశాఖపట్నం, మే , 2023: అచ్యుతాపురంలో ఉన్న యోకోహామా (ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్) టైర్స్ కంపెనీ సోషల్ ల్యాబ్ (టీఎస్ఎల్)తో భాగస్వామ్యం కుదుర్చుకుని, తన సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా మార్టూరు గ్రామంలో 10 వేల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకును నిర్మించింది. దాంతోపాటు స్థానిక పోలీసులకు 100 బారికేడ్లను ఏర్పాటు చేసింది. వాటర్ ట్యాంకును యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు (కన్నబాబు), యోకోహామా ప్లాంట్ అధినేత ప్రహ్లాద్ రెడ్డి ప్రారంభించారు.
మార్టూరు గ్రామంలోని వేలాదిమందికి ప్రస్తుతం సేవలందిస్తున్న వాటర్ ట్యాంకు పరిమాణం సరిపోకపోవడంతో పాటు అది బాగా పాడైన స్థితిలో ఉండటంతో దాన్ని మార్చాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రత్యామ్నాయ పరిష్కారాల గురించి సవివరంగా ఇంజనీరింగ్ మూల్యాంకనం చేసి, ఒక కొత్త, అతిపెద్ద ట్యాంకును నిర్మించడమే ఈ గ్రామవాసుల అవసరాలను తీర్చడానికి ఉత్తమమని నిర్ణయించారు. కొన్నేళ్ల క్రితం అభివృద్ధి చేసిన తాగునీటి సరఫరా వ్యవస్థకు ఈ కొత్త ట్యాంకును అనుసంధానం చేయనున్నారు. కొత్త వాటర్ ట్యాంకు ద్వారా గ్రామంలోని 1500 మందికి పైగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది.
వాటర్ ట్యాంకుకు సమీపంలో ఉన్న మార్గం, పరిసర ప్రాంతాల సుందరీకరణ, పరిశుభ్రత మెరుగుదలకు భారీ పెట్టుబడితో యోకోహామా తరఫున సహకారం అందిస్తామని ప్రహ్లాద్ రెడ్డి ప్రకటించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్ రాజు, ప్లాంటు హెచ్ఆర్ అధిపతి అద్దంకి వేణుగోపాల్, యోకోహామా సీఎస్ఆర్ ప్రతినిధి రస్మీత్ కౌర్, టీఎస్ఎల్ సీఈవో సాహిల్ అరోరా తదితరులు పాల్గొన్నారు. 100 మందికి పైగా గ్రామస్థులు పాల్గొన్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యోకోహామా బృందం నిర్వహించింది.
ఈ సందర్భంగా టీఎస్ఎల్ సీఈవో సాహిల్ అరోరా మాట్లాడుతూ , “ఎంతో ప్రభావం చూపించే ఇలాంటి ప్రాజెక్టు విషయంలో యోకోహామా టైర్స్ సంస్థతో భాగస్వాములు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది గ్రామంలో నివసిస్తున్న చాలా మంది ప్రజలకు ప్రాథమిక అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుంది” అన్నారు.
పాల్గొన్న వారందరికీ అల్పాహారాల పంపిణీ, ధన్యవాదాలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.