కార్పొరేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ విజేతగా టీమ్‌ ఇన్ఫోసిస్హైటెక్ సిటీ గేమ్‌ పాయింట్‌ని అత్యాధునిక బ్యాడ్మింటన్‌ సెంటర్‌‌లో ముగిసిన టోర్నీ

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 5, 2024: ఐదో ఎడిషన్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో టీమ్ ఇన్ఫోసిస్ చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్‌లో హైక్వాలిటీ స్పోర్ట్స్ సెంటర్‌ అయిన హైటెక్‌ సిటీ గేమ్‌ పాయింట్‌ లో ఆదివారం ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో టీమ్ ఆప్టమ్‌ను ఓడించి టీమ్ ఇన్ఫోసిస్ ట్రోఫీని కైవసం చేసుకుంది. చాలెంజర్స్ కప్ ఫైనల్లో టీమ్ నోవార్టిస్… జేపీ మోర్గాన్ ఛేజ్ పై విజయం సాధించింది. వ్యక్తిగత ఈవెంట్లలో టీసీఎస్‌కు చెందిన రుత్విక దాస్ మహిళల సింగిల్స్‌ ట్రోఫీ గెలుచుకోగా.. పురుషుల సింగిల్స్‌లో ప్రణవ జైన్‌ టైటిల్ నెగ్గాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రుత్విక 30-23తో గీత (జేపీఎంసీ)ని ఓడించింది. పురుషుల ఫైనల్లో జైన్ కు వాకోవర్‌ లభించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అవ్వారు సతీష్ బాబు– దొంతు సాయి రామ్ (ఎఫ్‌ఐఎన్‌ఎంకేటీ) 30-22తో ఇన్ఫోసిస్‌కు చెందిన భరత్– మనోజ్‌ను ఓడించి విజేతలుగా నిలిచారు.

మహిళల డబుల్స్‌లో టీసీఎస్‌కు చెందిన పూజా –రిత్విక దాస్ టైటిల్ నెగ్గింది. ఫైనల్లో ఈ ద్వయం 30-26 తేడాతో గీతా – నికిత (జేపీఎంసీ) జంటను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇన్ఫోసిస్‌కు చెందిన భరత్– మౌసమ్ విజేతలుగా నిలిచారు. ఫైనల్లో భరత్–మౌసమ్ 30-25 తేడాతో మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రణవ జైన్– రియా కుమారిపై విజయం సాధించారు. 35+ పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో విప్రోకు చెందిన రఘు వంశీ. పి 30-18తో సత్య. ఆర్ (సర్వీస్ నౌ)ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకోగా, 35+ పురుషుల డబుల్స్ ఫైనల్లో నోవార్టిస్‌కు చెందిన అబ్దుల్ జబ్బార్ –దీపక్ దీక్షిత్ 30-21తో జగదీష్ –నందికోళ్ల శ్రీనాధ్ (ఆప్టమ్)పై విజయం సాధించారు. అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ చైర్మన్ కంకణాల అభిషేక్‌రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అభిషేక్‌ రెడ్డి మాట్లాడుతూ ‘క్రీడల ద్వారా కార్పొరేట్ ప్రపంచంలోని ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను అందించేందుకు కార్పొరేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహించడం గేమ్‌ పాయింట్‌ ఒక గొప్ప చొరవ తీసుకుంది. తద్వారా ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు వారిలో టీమ్‌ వర్క్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గేమ్‌ పాయింట్ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ రెడ్డి కార్పొరేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతలందరికీ అభినందనలు తెలిపారు. ‘ఈ టోర్నమెంట్ ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగులకు ఒక మైలురాయిగా మారింది. ఇందులో భాగం అయ్యేందుకు, పోటీపడేందుకు ఉద్యోగులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొన్నేళ్లుగా కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల శారీరక శ్రేయస్సు, జట్టు కృషిని ఏకీకృతం చేయడంలో ఈ టోర్నమెంట్ కీలకమైన అడుగు వేసింది. క్రీడలు, ఫిట్‌నెస్‌కు విలువనిచ్చే సంస్కృతిని సృష్టించడానికి గేమ్‌ పాయింట్‌ అంకితభావంతో ముందుకెళ్తోంది. దాని ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ కొత్త కోణంలో ఆలోచించేలా ఈ టోర్నమెంట్‌ ప్రేరేపిస్తుందని మేము ఆశిస్తున్నాం. మున్ముందు మా అత్యాధునిక కోర్టుల్లో మరిన్ని బడా కార్పొరేట్ కంపెనీలు ఉత్తేజకరమైన బ్యాడ్మింటన్ ఆటలో నిమగ్నం అవుతాయని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

కాగా, కార్పొరేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ను ఏడు వ్యక్తిగత ఈవెంట్లతో పాటు ప్రత్యేకమైన టీమ్ ఈవెంట్ ఫార్మాట్‌లో నిర్వహించారు. టీమ్ ఈవెంట్‌లో జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, గోల్డ్‌మన్ సాక్స్‌, ఇన్ఫోసిస్‌, నోవార్టిస్ ఇండియా లిమిటెడ్, కోల్రుయ్ట్ గ్రూప్, ఎఫ్‌ఐన్‌ఎంకేటీ, సామ్రాట్ గ్రూప్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆప్టమ్‌ సహా 8 కంపెనీలు పాల్గొన్నాయి. ఏడు వ్యక్తిగత ఈవెంట్లలో 100 మందికి పైగా పోటీ పడ్డారు. ఈ టోర్నమెంట్‌లో 30 పాయింట్లతో కూడిన సింగిల్‌ గేమ్‌ ద్వారా మ్యాచ్‌లను నిర్వహించారు.

Leave a Reply