మత్య్సకారుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను సర్కార్ మానుకోవాలి… పవన్ కల్యాణ్

మత్య్సకారుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను సర్కార్ మానుకోవాలి… పవన్ కల్యాణ్

సంప్రదాయంగా, వారసత్వంగా వస్తున్న చేపల వేట, అమ్మకాలపై ఆధారపడ్డ మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టి, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లు లాంటి చోట్ల మత్స్యకార సొసైటీ సభ్యులకు చేపలు వేటాడుకొనే అవకాశం లేకుండా చేస్తున్న జీవో 217 విషయంలో జనసేన పార్టీ ఎలా పోరాడాలనే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారు పాల్గొన్నారు. విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను, జీవో 217 తమ జీవనోపాధికి ఎలా విఘాతం కలిగిస్తుందో వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రజా పోరాట యాత్రను ఇచ్చాపురం ప్రాంతంలో కపాసు కుర్ది దగ్గర గంగమ్మకు పూజ చేసే మొదలుపెట్టాను. కోస్తాలో పర్యటించిన ప్రతి ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల గురించి, ఇక్కడ జీవనోపాధి లేక వలసలుపోతుండటాన్ని అవగాహన చేసుకున్నాను. మత్స్యకారుల సమస్యలపై పోరాడటమే కాకుండా… ఈ వృత్తిపై ఆధారపడ్డవారు నైపుణ్యాలు పెంచుకొని ఆర్థికంగా ఎదిగే అంశాలపై అవగాహన కలిగించేందుకే పార్టీ పక్షాన మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేశాం. పాలనలో ఉన్నవారు సైతం సంప్రదాయ వృత్తులపై ఆధారపడ్డవారికి ఆర్థిక బలం చేకూర్చేలా చేయాలి. అంతేగానీ ఆర్థిక మూలాలను దెబ్బ తీసేలా నిర్ణయాలు చేయకూడదు. చెరువులు, రిజర్వాయర్ల దగ్గర చేపల వేటకు మత్స్యకారులకు అవకాశం లేకుండా చేసి వేలం ద్వారా సమకూరే ఆదాయంలో 70శాతం ప్రభుత్వమే తీసుకొంటుందనే ఆందోళన మత్స్యకారుల్లో ఉంది” అన్నారు.
మత్స్యకార వికాస విభాగం సభ్యులు తమ ఆందోళనను వెలిబుచ్చుతూ ఈ విధంగా వేలం వేయడం అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే… అదీ నెల్లూరు జిల్లాకే పరిమితం అని రాష్ట్ర మంత్రి చెబుతున్నారనీ… అయితే జీవో 217లో ఆ వివరాలు లేవు అన్నారు. ఈ వృత్తిపై ఆధారపడ్డవారికి ఉపాధి లేకుండా చేస్తుంది ఈ జీవో అని తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి.శివశంకర్ గారు, శ్రీ సత్య బొలిశెట్టి గారు, శ్రీమతి పాలవలస యశస్వి గారు, లీగల్ సెల్ ఛైర్మన్ శ్రీ ఈవన సాంబశివ ప్రతాప్ గారు పాల్గొన్నారు.