నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు- రామ్ గోపాల్ వర్మ…
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. కంపెనీ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా వరంగల్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరిగింది. దీనికి కొండా మురళి, సురేఖ దంపతులు హాజరయ్యారు. ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెటప్‌లో వచ్చారు. అంతే కాదు… ‘కొండా’, ‘బలుపెక్కిన ధనికుడా… కాల్ మొక్కుడు లేదిక’ పాటలకు ఆయన పెర్ఫార్మన్స్ చేశారు. హీరో అదిత్ అరుణ్, ఇతర నటీనటులతో కలిసి స్టెప్పులు వేశారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “సినిమా స్టార్ట్ చేసేముందు నేను కొండా మురళి పేరు వినలేదు. ఓ ఎన్నికల సమయంలో కొండా సురేఖ పేరు విన్నాను. ఆమె ఇంటర్వ్యూలు చూశా. నేను రాజకీయాలు ఫాలో అవ్వను. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. నేను ముంబైలో ‘సత్య’, ‘కంపెనీ’, ఇక్కడ ‘రక్త చరిత్ర’ తీసినప్పుడు గానీ తెలంగాణలో సాయుధ పోరాటం గురించి తెలియదు. ఒక వ్యక్తి చెప్పారు. అప్పుడు ఆయన గురించి రీసెర్చ్ చేశా. ప్రతి కథకు, సినిమాకు ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఉదాహరణకు… హిట్లర్ లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం, గాంధీజీ లేకపోతే భారత స్వాతంత్య్ర పోరాటానికి అర్థమే లేదు. గాంధీ ఒకవైపు, హిట్లర్ మరోవైపు ఉంటే కొండా మురళి మధ్యలో ఉన్నారు. తనను జైలులో చంపేస్తారా? అనేదాన్ని ఎదుర్కొని, చావుతో ఆడుకుని, నేడు ఇక్కడ కూర్చున్నారు. కొండా మురళి ఎక్స్‌పీరియన్స్‌లు విని నేను విపతీరంగా ప్రభావితం అయ్యాను. నాకు హిట్లర్, ముస్సోలిని, ప్రభాకరన్ నేపథ్యాలు తెలుసు. వీళ్లందరూ నమ్మిన సిద్ధాంతాలు, విలువల కోసం పోరాడతారు. అటువంటి అంశం నాకు కొండా మురళి జీవితంలో దొరికింది. అది పట్టుకుని, ఆ తాడును పట్టుకుని తీశా. ఈ రోజు నాకు సాయుధ పోరాటం, నక్సలైట్ల గురించి తెలుసు. కొండా మురళి, సురేఖ జీవితాలను ఎంపిక చేసుకోవడానికి కారణం… వాళ్ల నేపథ్యంలో ఈ కథ చెప్పడానికి అద్భుత అవకాశం దొరికింది. అందుకని, సినిమాకు ‘కొండా’ పేరు పెట్టాను. ప్రమాదాన్ని కొండా మురళి కోరి తెచ్చుకున్నారు. ప్రమాదం వస్తుందని భయపడలేదు. దాన్ని చూసి స్ఫూర్తి పొంది సినిమా తీశా. కొండా మురళి జీవించిన జీవితమే నా సినిమా కథ. కొండా మురళి శత్రువులు, కొంత మంది పోలీసులను కలిసి వాళ్లు చెప్పినది విన్న తర్వాత నాకు ఓ క్లారిటీ వచ్చింది. నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు. నేను అనుకున్నది 20 శాతం తీసినా నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది” అని అన్నారు. కొండా మురళి మాట్లాడుతూ “రామ్ గోపాల్ వర్మ గురించి ఏమనుకుంటారో, కొండా మురళి గురించి కూడా ప్రజలు అదే అనుకుంటారు… ‘ఎవరి మాట వినరు’ అని! నేను మాట వినను. కానీ, జనాలకు సేవ చేస్తా. మాట తప్పను, మడమ తిప్పను. పని మాత్రం చేసి పెడతా. ఈ రోజు వరకు ఇలా బతుకుతున్నామంటే ప్రజలే కారణం. బాల్ థాకరే, అమితాబ్ బచ్చన్ నుంచి మొదలు పెడితే… పెద్ద పెద్ద హీరోలతో వర్మ పని చేశారు. ఆ స్థాయిలో కొండా మురళిని తీసుకు రావాలని ఈ సినిమా చేశారు. ప్రజల కోసం నేను ఎంత తపన పడతానో… సినిమా కోసం వర్మ అంత తపన పడ్డారు. వర్మను మా కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని ప్రజల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆయన ఏ కల్మషం లేని వ్యక్తి. నా పాత్రలో అదిత్ అరుణ్ బాగా నటించారు. ఆయన్ను చూస్తే నన్ను చూసినట్టు ఉంది. నా మీద ఫైరింగ్ అయ్యే సీన్ చూస్తే… నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది చూడలేక పక్కకి వెళ్లాను. సినిమా మరో మూడు పార్ట్స్ తీయాలని కోరుతున్నాను” అని అన్నారు.
కొండా సురేఖ మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ సింహం అయితే… రాజకీయాల్లో కొండా మురళి సింహం. మురళి గారి బయోపిక్ చేయాలని చాలా రోజులుగా మా కోరిక. గుణశేఖర్ గారిని కలిసినప్పుడు నేను, మా అమ్మాయి మా మనసులో మాట చెప్పాం. ఆయన ఒక్కటే మాట అన్నారు… ‘మీ బయోపిక్ తీయాలంటే ఆర్జీవీ సారే తీయాలి. ఆయన షూటింగులో ఉండి తీయాలి. అప్పుడే క్లిక్ అవుతుంది’ అన్నారు. అప్పుడు మాకు ఆర్జీవీ అన్నను కలిసే అవకాశం రాలేదు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో వాళ్లిద్దరూ కలిశారు. ‘కొండా’ తెరకెక్కింది. ఒక తపస్సులా ఆర్జీవీ ఈ సినిమా తీశారు. ఆయన పనులన్నీ వదిలేసి… రోజుల తరబడి వరంగల్‌లో ఉండి సినిమా తీశారు. మా జీవితం రెండున్నర గంటల్లో చూపించే సినిమా కాదు. వర్మకు కథ మొత్తం తెలుసు. రెండున్నర గంటల్లో పది శాతం జీవితాన్ని తీసుకొచ్చినా సంతోషపడతానని వర్మ చెప్పారంటే… మా జీవితం ఎలా ఉండేదో అర్థం చేసుకోండి. పులి కడుపులో పులే పుడుతుంది. నా కూతురు పులి. ఏడేళ్ల నుంచి తను ఎన్నో కష్టాలు పడింది. మా కుటుంబాలు కూడా ఎన్నో బాధలు పడ్డాయి. భవిష్యత్తులో వాటిని వేరే రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వర్మ చెప్పారు. ఇప్పుడు ట్రైలర్ చూపించారు. అందులో లీనం అయ్యా. సినిమా ఎలా తీశారో చెప్పనవసరం లేదు. కొండా మురళి జీవితం చాలా మందికి తెలియదు. మేం ముళ్లబాట మీద నడిచి ఈ స్థాయికి వచ్చాం. మేం ఈ స్థాయికి ఎదగడానికి ప్రజలు కారణం. ఈ సినిమాతో ప్రజలకు తెలుస్తుంది. వర్మ మా సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు బాగా చేశారు” అని అన్నారు. అదిత్ అరుణ్ మాట్లాడుతూ “కొండా మురళి, సురేఖ గారి ఆతిథ్యానికి థాంక్స్. మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. వరంగల్ రెండు చేతులతో ఆహ్వానించి, హత్తుకుని, బాగా చూసుకుంది. మా నాన్నగారి ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ లో అంట. నేను సినిమా షూటింగ్ కోసం వచ్చాను. ‘కొండా’ విడుదల తర్వాత మళ్లీ వస్తాను. నేను రామ్ గోపాల్ వర్మగారితో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్షన్ బ్లాక్ బస్టర్ చేయాలనుకున్నాను. నేను స్క్రీన్ మీద ఏం సినిమా చూడాలని అనుకున్నానో… అటువంటి సినిమాలో ఉండటం నా అదృష్టం. ఈ సినిమా కోసం ఆర్జీవీ టీమ్ బాగా వర్క్ చేసింది. తెలంగాణాలో నాకే తెలియని కథ ఉందని, కలిసి సినిమా చేద్దామని ఆర్జీవీ అన్నారు. అన్నట్టుగా టెర్రిఫిక్ ఫిల్మ్ తీశారు” అని చెపారు. ‘పదవి, పైసల్ కన్నా ఆత్మాభిమానం చాలా చాలా ముఖ్యం. దాని కోసం ఏమైనా చేస్తా’ అనే సినిమాలో డైలాగ్ చెప్పారు.సుష్మిత మాట్లాడుతూ “రామ్ గోపాల్ వర్మ గారు మా నాన్న సినిమా తీస్తున్నారంటే ఎమోషనల్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నాన్న నా హీరో. ఇప్పటికీ ఆయనే హీరో. వర్మను కలిసినప్పుడు మా జీవితంలో జరిగినవి రెండు మూడు కథలు చెప్పాను. ఆయన విన్నారు. రాము అని పిలవమని చెప్పారు. సినిమాలో నా క్యారెక్టర్ లేదు. ఎందుకు లేదనేది ఆయన చెప్పారు. రాము తీసిన సినిమాల్లో ‘అంతం’, ‘శివ’, ‘గోవిందా గోవిందా’, ‘సర్కార్’ నాకు చాలా ఇష్టం. ‘అంతం’ చాలాసార్లు చూశా” అని అన్నారు. ‘ఆటో’ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ “నాకు వరంగల్‌తో పెద్దగా పరిచయం లేదు. నాకు వరంగల్ అంటే వెయ్యి స్థంబాల గుడి. కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది… వరంగల్ అంటే కొండా మురళి అని. ఒక రియల్ హీరో స్టోరీని ఇంకో హీరో తీస్తున్నారంతే! ఆర్జీవీ సినిమాలో చేయడం అదృష్టంగా ఫీలవుతున్నా” అని అన్నారు. ఆర్‌కె మాస్టర్ మాట్లాడుతూ… “బాస్ (రామ్ గోపాల్ వర్మ)తో మూడు నాలుగు సినిమాలు చేసి ఉన్నాను. ఇందులో బాస్ పాడిన సాంగ్ కొరియోగ్రఫీ చేయమన్నారు. అదే పెద్ద టాస్క్. వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులతో గన్నులు, కత్తులతో సాంగ్ అంటే ఇంకా కష్టం. మనం ఎప్పుడూ డ్యాన్సే చేశాం. కత్తలు, కటారులతో సాంగ్ చేయలేదని చెప్పా. ఈ సినిమాలో కత్తులు లేని పాటే లేదని చెప్పారు. నరకడం, కొరకడం, చంపడం! సాంగ్ వింటేనే గూస్ బంప్స్ వచ్చాయి. బాస్ స్టయిల్‌లో చేశా” అని అన్నారు. అదిత్ అరుణ్, ఇర్రా మోర్, పృథ్వీరాజ్, తులసి, ఎల్బీ శ్రీరామ్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, అభిలాష్ చౌదరి, శ్రవణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జక్కుల వెంకటేశ్, ఎడిటర్: మనీష్ ఠాకూర్, ఛాయాగ్రహణం: మల్హర్ భట్ జోషి, సంగీతం: డి.ఎస్.ఆర్, కో-డైరెక్టర్: అగస్త్య మంజు, నిర్మాణం: కంపెనీ ప్రొడక్షన్, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.