కర్నాటకలో సంపూర్ణ మెజారిటీ సాధిస్తాం : అమిత్ షా
తెలుగు సూపర్ న్యూస్,మార్చి 30,2023: కర్నాటక 224 అసెంబ్లీ సీట్లకు మే10వ తేదీన జరుగుతున్న ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీ సాధించగలమనే విశ్వాసాన్ని కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకలో వరుసగా రెండవ సారి అధికారం చేజిక్కుంచుకోవడంతో పాటుగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తామనే విశ్వాసం ఉందని ఆయన వెల్లడించారు.
కర్నాటకలో ఎన్నికలకు ముందు లేదా తరువాత ఎలాంటి భాగస్వామ్యాలనూ భారతీయ జనతా పార్టీ (బీజెపీ) చేసుకోదని విస్పష్టంగా ఈ మాస్టర్ వ్యూహకర్త ప్రకటించారు. ‘‘కర్నాటకలో తాను తొమ్మిది రోజులు గడిపాను. రాష్ట్రంలో ఐదు ప్రాంతాలనూ సందర్శించాను. ఈ సందర్శనలో గమనించిన అంశాలతో, తాను పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను. రాష్ట్రంలో పూర్తి మెజారిటీ సాధించగలము. ఇది మోదీ నాయకత్వంలో జరిగి తీరుతుంది.
ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు’’ అని షా, న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తూ వెల్లడించారు. జెడీఎస్‌తో ఎలాంటి పొత్తులూ ఉండవని తేల్చి చెప్పిన షా, కర్నాటకలో 224 సీట్లకూ బీజెపీ సొంతంగా పోటీ పడుతుందని , ఎలాంటి పొత్తులనూ, ఏ పార్టీతోనూ రాష్ట్రంలో పెట్టుకోదని, గత ఎన్నికలలో సాధించిన 104 సీట్ల మార్కును మరింత మెరుగుపరుచుకోగలమనే నమ్మకంతో ఉన్నామన్నారు.
‘‘ఎలాంటి భాగస్వామ్యాలనూ , ఏ పార్టీతోనూ చేసుకోము’’ అని షా అన్నారు. లక్షలాది మంది కార్యకర్తలతో చర్చించిన పిమ్మట పార్టీ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందని షా వెల్లడించారు. కాంగ్రెస్ మరియు జెడీఎస్‌లు ఇప్పటికే తమ తొలి జాబితా అభ్యర్ధుల పేర్లను వెల్లడించాయి.
ప్రధానమంత్రి మోదీకు వ్యతిరేకంగా పోరాడుతూ కర్నాటకలో కాంగ్రెస్ పోటీపడితే చాలని, దానికి మించిన గెలుపు సూత్రమేమీ బీజెపీకి లేదని కాంగ్రెస్ పార్టీని ఉద్ధేశించి వ్యంగ్యంగా షా అన్నారు.
‘‘ఒకవేళ వారు ఎన్నికలలో (కర్నాటక)లో పోటీపడుతూ మోడీ వర్సెస్ గాంధీ పోటీగా చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదు. నిజానికి బీజెపీకి దీనికి మించిన గెలుపు సూత్రం కూడా లేదు’’ అని షా , న్యూస్ 18 రైజింగ్ ఇండియా సదస్సులో వీక్షకుల నవ్వుల మధ్య చెప్పారు.
ఢిల్లీలో ఓ వర్గపు రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్‌లో కూడా అమిత్ షా లాంటి నాయకుని అవసరం ఉంది. అలాంటి నాయకుడు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం పొందగలుగుతుందని నమ్ముతున్నారు. దీనికి తోడు కూరలో ఉప్పులా జాతీయ రాజకీయాలలో బీజెపీ బలంగా నాటుకు పోవడానికి గాంధీ (రాహుల్) ఇతోధికంగా సహాయపడ్డారని వారు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతి చోటా గాంధీ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ మిశ్రమ ఫలితాలు సాధించింది.
కర్నాటకలో ఓబీసీ విభాగంలో ముస్లింలకు 4% రిజర్వేషన్లను కల్పించినందుకు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు షా. ఇటీవలనే బీజెపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటుగా ఆ రిజర్వేషన్లను వొక్కిలిగాస్ మరియు వీరశైల–లింగాయత్‌లు పంచింది.
ఈ అంశాలను ప్రస్తావించిన షా, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, ఈ కోటాను ముందుగానే రద్దు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అయితే , కాంగ్రెస్ పై షా దాడి అక్కడితో ఆగలేదు. లోక్‌సభ నుంచి రాహుల్‌గాంధీని డిస్ క్వాలిఫై చేయడం, అనంతరం కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తోన్న దాడిని గురించి షా మాట్లాడుతూ ‘‘ గాంధీ కుటుంబం తమకు ప్రత్యేక చట్టం ఉండాలని ఎందుకు కోరుకుంటుంది ?’’ అని ప్రశ్నించారు.
‘‘మన దేశంలో ఒక కుటుంబం కోసం ప్రత్యేకంగా ఒక చట్టం కావాలా అన్నది భారత ప్రజలు నిర్ణయించుకోవాలి ’’అని అన్నారు. రాహుల్ గాంధీ ఇటీవలనే లోక్‌సభ సభ్యునిగా తన అర్హతను సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కోల్పోయారు.
మోదీ కమ్యూనిటీపై ఆయన చేసిన పరుష వ్యాఖ్యలు సమ్మతనీయం కాదని వెల్లడించిన కోర్టు ఆయనకు శిక్షను ఖరారు చేసింది. అనంతరం, గాంధీని తన అధికారిక బంగ్లా కూడా ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వ వర్గాలు కోరాయి.
కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ఎపిసోడ్‌ను తమ నాయకుని వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణిస్తోంది. రాజకీయంగా ఈ అంశాలను ఉపయోగించుకోవడం ద్వారా పలు రాష్ట్రాలలో ఎన్నికలలో పోటీపడాలని భావిస్తోంది తప్ప, ఈ తీర్పు గురించి పై కోర్టులలో ఇప్పటి వరకూ అప్పీలు చేయలేదు.
ఈ తీర్పు గురించి గాంధీ ఉన్నత కోర్టులకు వెళ్తే బాగుంటుందని సూచిస్తూనే, ప్రధానమంత్రిని నిందించవద్దని తెలిపారు. రాహుల్‌గాంధీ అహంకారమే ఇప్పటి వరకూ అతను ఉన్నత కోర్టులకు అప్పీలు చేయకుండా నిరోధిస్తుందని షా అభిప్రాయపడ్డారు.
‘‘ఈ అహంకారం ఎక్కడ నుంచి వచ్చింది ? లాలూ ప్రసాద్, జె జయలలిత, రషీద్ అల్వీ వంటి 17 మంది నాయకులు తమ సభ్యత్వాలను కోల్పోయారు. వారెవరూ కూడా ఈ తరహా గోల చేయలేదు’’ అని కాంగ్రెస్‌కు చురకలు వేశారు షా.
లెఫ్ట్–వింగ్ ఎక్స్‌ట్రీమిజం (ఎల్ డబ్ల్యుఈ) పై అడిగిన ఓ ప్రశ్నకు షా సమాధానమిస్తూ కేంద్రంలో గత తొమ్మిది సంవత్సరాల బీజెపీ పాలనలో పరిస్థితి చాలా మెరుగుపడిందన్నారు. ఎల్‌డబ్ల్యుఈ సంబంధిత సంఘటనలు క్రమంగా క్షిణిస్తున్నాయన్నారు. కొన్ని రాష్ట్రాలలో పలు జిల్లాల్లో వారి ఉనికి నామమాత్రంగా ఉన్నప్పటికీ ఈ భయంపై విజయం మాత్రం త్వరలోనే సంపూర్ణంగా సిద్ధిస్తుందన్నారు. ఎల్‌డబ్ల్యుఈ హింసాత్మక సంఘటలు 76శాత పైగా తగ్గాయని ఆయన తెలిపారు.